JEE: జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాల్లో బల్లార్ పూర్ కుర్రాడికి టాప్ ర్యాంక్
- తెలుగు కుర్రాడికి ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ కేటగిరీలో ప్రథమర్యాంకు
- మహిళల్లో షబ్నమ్ సహాయ్ టాప్
- ఫలితాలు ప్రకటించిన ఐఐటీ రూర్కీ
దేశవ్యాప్తంగా నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ డ్-2019 ఎంట్రన్స్ పరీక్ష ఫలితాలు ఈ మధ్యాహ్నం వెల్లడయ్యాయి. మహారాష్ట్రకు చెందిన కార్తికేయ చంద్రేశ్ గుప్తా ఓపెన్ విభాగంలో ప్రథమర్యాంకు దక్కించుకున్నాడు. గుప్తా స్వస్థలం బల్లార్ పూర్. గుప్తాకు ఈ పరీక్షలో 372 మార్కులకు గాను 346 మార్కులు లభించాయి. అతని తర్వాత అలహాబాద్ కు చెందిన హిమాంశు గౌరవ్ సింగ్ రెండో ర్యాంకు, అర్చిత్ బుబ్నా (ఢిల్లీ) మూడో ర్యాంకు సాధించారు.
ఇక, గాంధీనగర్ కు చెందిన తెలుగు కుర్రాడు దాసరి రాజేశ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ కేటగిరీలో తొలి ర్యాంకు సంపాదించాడు. ప్రాంతాల వారీ ఫలితాల్లో ఐఐటీ హైదరాబాద్ పరిధిలో జిల్లెళ్ల ఆకాశ్ రెడ్డి టాప్ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. అమ్మాయిల్లో షబ్నమ్ సహాయ్ ప్రథమస్థానం దక్కించుకుంది. ఈసారి జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలను ఐఐటీ రూర్కీ వెల్లడించింది. ఈ మేరకు ర్యాంకులు, ఎగ్జామ్ ఫైనల్ కీ అధికారిక వెబ్ సైట్ లో ఉంచారు.