Andhra Pradesh: ప్రతీ తల్లి-చెల్లికి నేను మాటిచ్చా.. మీ పిల్లల చదువు బాధ్యత ఇకపై నాదే!: ఏపీ సీఎం జగన్

  • చిన్నారులతో గడపడం నా మనసుకు నచ్చిన విషయం
  • పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదు
  • రాజన్న బడిబాట కార్యక్రమంలో మాట్లాడిన ఏపీ ముఖ్యమంత్రి

చిన్నారులతో కలిసి గడపడం, వాళ్లు బాగా చదువుకోవడం తన మనసుకు నచ్చిన విషయమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. తన మనసుకు నచ్చిన పనిచేస్తున్నాను కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లాలోని పెనుమాక జెడ్పీ పాఠశాలలో ‘రాజన్న బడిబాట’ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి పలువురు చిన్నారుల చేత అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం మాట్లాడుతూ..‘పిల్లలు బడికి పోవాలి. బడుల నుంచి కాలేజీకి పోవాలి. అక్కడి నుంచి వాళ్లు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్ల వంటి పెద్దపెద్ద చదువులు చదవాలి. ఈ చదువుల కోసం ఏ తల్లీతండ్రి అప్పులపాలు కాకూడదు అన్నదే నా ఆశ.

నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో పేదల కష్టాలు చూశా. పేదవాడు పడుతున్న బాధలు విన్నా. చదివించాలన్న ఆరాటం ఉన్నా.. చదివించలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులను చూశా. పిల్లలను ఇంజనీరింగ్ చదవించాలనీ, ఆ ఖర్చులను భరించలేక పిల్లలు సైతం ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులను నా కళ్లారా చూశా. ఈ వ్యవస్థలో సంపూర్ణమైన మార్పు తీసుకొస్తామని దృఢ సంకల్పంతో చెప్పా. ప్రతీ తల్లికి, ప్రతీ చెల్లికి నేను మాటిచ్చా.. మీ పిల్లల చదువును ఇకపై నేను చూసుకుంటాను అని మాటిచ్చా. ఈరోజు ఆ మాట నిలబెట్టుకునే రోజు వచ్చింది. అందుకు సంతోషంగా ఉంది. ఇవాళ నేను ప్రతీ తల్లి, చెల్లికి ఇక్కడి నుంచి ఒకేఒక మాట చెబుతున్నా. మీ పిల్లలను మీరు బడికి పంపండి.

మీరు చేయాల్సిందల్లా ఏ స్కూలుకు పంపించినా ఫరవాలేదు. బడికి పంపించినందుకు వచ్చే ఏడాది జనవరి 26 నాటికి ఏపీ పండుగదినం చేస్తాం. జనవరి 26వ తారీఖున పిల్లలను బడికి పంపే ప్రతీ తల్లి చేతిలో రూ.15,000 పెడతాం. ఏ తల్లి కూడా తన బిడ్డను చదివించేందుకు కష్టపడకూడదు అనే తపనతో ఈ కార్యక్రమం చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి తెలిపారు. ఏపీలో ప్రస్తుతం 33 శాతం మంది చదువురాని వారున్నారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ గణాంకాలు బయటపడ్డాయని చెప్పారు. అదే భారత్ సగటు చూసుకుంటే 26 శాతం నిరక్షరాస్యత రేటు ఉందని వెల్లడించారు. అంటే భారతదేశం సగటుతో పోల్చుకుంటే ఏపీ ఇంకా దిగువన ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News