BJP Social Media: అసోం ముఖ్యమంత్రిపై అనుచిత పోస్టింగులు.. బీజేపీ సోషల్ మీడియా సభ్యుడి అరెస్ట్
- వలస ముస్లింల నుంచి స్థానిక అస్సామీలను ప్రభుత్వం రక్షించలేకపోతోంది
- శాంతి భద్రతలను కాపాడడంలో సీఎం విఫలం
- వాక్ స్వాతంత్య్రాన్ని ఖూనీ చేస్తున్నారంటూ మండిపడుతున్న నిందితులు
అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ను అవమానిస్తూ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన బీజేపీ సోషల్ మీడియా సెల్ సభ్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రిపై ఇటువంటి పోస్టులే చేసిన మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
మోరిగావ్ జిల్లాకు చెందిన బీజేపీ ఐటీ సెల్ సభ్యుడు నీతు బోరాను అరెస్ట్ చేసినట్టు చెప్పిన పోలీసులు మరో సభ్యుడు హేమంత బారువా ఇంటిపై దాడిచేసినట్టు తెలిపారు. అలాగే, నితుమోని బోరా అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్టు వివరించారు.
రాష్ట్రంలోకి వలస వస్తున్న ముస్లిం సెటిలర్ల నుంచి స్థానిక అస్సామీలను బీజేపీ రక్షించలేకపోతోందని, దీనికి ముఖ్యమంత్రి సోనోవాల్ బాధ్యత వహించాలని నీతు బోరా తన పోస్టులో పేర్కొన్నాడు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో సీఎం విఫలమయ్యారని ఆరోపించాడు. కాగా, పోలీసులు తమను అరెస్ట్ చేసి వాక్ స్వాతంత్య్రాన్ని ఖూనీ చేస్తున్నారని అరెస్ట్ అయిన నిందితులు ఆరోపించారు.