Andhra Pradesh: టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని బంట్రోతు అన్న చెవిరెడ్డి.. సభలో ఒక్కసారిగా కలకలం!
- స్పీకర్ కు శుభాకాంక్షలు చెప్పిన వైసీపీ నేత
- కోడెలను జగన్ సీటు వరకూ తీసుకొచ్చారు
- బలహీనవర్గానికి చెందినవారు కాబట్టే చంద్రబాబు రాలేదు
టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన నారావారిపల్లెకు కూడా తానే ఎమ్మెల్యేగా ఉన్నానని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తెలిపారు. ఈరోజు స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన తమ్మినేని సీతారామ్ కు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘గతంలో స్పీకర్ ఎన్నికల సందర్భంగా నోట్ పంపామని టీడీపీ నేతలు చెబుతున్నారు. కోడెలను స్పీకర్ గా ఎన్నుకోగానే జగన్ స్వయంగా చేయిపట్టుకుని సీటు వరకూ వచ్చి కూర్చోబెట్టారు. ఆ రోజున టీడీపీ కంటే వైసీపీ నేతలు ఎక్కువ సంతోషపడ్డారు. కానీ ఇప్పుడు ఓ బలహీనవర్గానికి చెందిన ఎమ్మెల్యేను స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టేందుకు కూడా వీళ్లకు(టీడీపీ సభ్యులకు) మనసు రాలేదు.
వీళ్లా సభాసంప్రదాయాల గురించి మాట్లాడేది? స్పీకర్ బలహీనవర్గాలకు చెందినవారు కాబట్టే మీ చేయి పట్టుకోవడానికి టీడీపీ నేతల మనసు ఒప్పుకోవడం లేదు అధ్యక్షా. అదే స్థానంలో తమ సామాజికవర్గం వ్యక్తి ఉండి ఉండే చేయి పట్టుకుని స్వయంగా తీసుకెళ్లి కూర్చోబెట్టేవారు. కానీ ఇప్పుడు చంద్రబాబు స్పీకర్ ను కుర్చీ వద్దకు తీసుకెళ్లేందుకు తన బంట్రోతును పంపారు’ అని చెవిరెడ్డి అచ్చెన్నాయుడిని పరోక్షంగా ప్రస్తావించారు. దీంతో సభలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. చెవిరెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయగా, వెనక్కి తగ్గేది లేదని వైసీపీ సభ్యులు స్పష్టం చేశారు.