Jagan: ఐదారుగురు టీడీపీ ఎమ్మెల్యేలను లాగేద్దామని మా వాళ్లు అంటే... నేను ఇదే చెప్పాను: జగన్
- 23 మందిలో ఐదుగురిని లాగేద్దామన్నారు
- 18 మందే మిగిలితే ప్రతిపక్ష హోదా ఉండదన్నారు
- అలా చేస్తే, నాకు, ఆయనకు తేడా ఏంటని ప్రశ్నించా
- అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొలి నాళ్లలోనే వాడివేడి రూపాన్ని సంతరించుకున్నాయి. స్పీకర్ గా తమ్మినేని ఎన్నిక అనంతరం మాట్లాడిన వైఎస్ జగన్, చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగారు. గత శాసనసభ చేసిన దుర్మార్గాలను ఈ సభ చేయదని అంటూ చురకలు అంటించారు. చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చూసేందుకు కొందరు ఎమ్మెల్యేలను లాగేద్దామని పార్టీ నేతలు కొందరు చెబితే తాను అంగీకరించలేదన్నారు.
"అధ్యక్షా... నేను ఇక్కడికి వచ్చేటప్పుడు అడిగారు. చంద్రబాబునాయుడికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక ఐదుగురిని లాగేస్తే, ఆయనకు 18 మందే వస్తారు. అప్పుడాయనకు ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు. లాగేద్దామని. అప్పుడు నేనన్నాను... అధ్యక్షా... అలా చేస్తే, నాకూ, ఆయనకూ తేడా లేకుండా పోతుంది అన్నాను. అధ్యక్షా... ఇక్కడ ఇదే చట్టసభలో నేను ఇంకొకటి చెబుతా ఉన్నాను. ఆ పార్టీలో నుంచి మేము ఎవరినైనా తీసుకుంటే, వారిని కచ్చితంగా రాజీనామా చేయిస్తాం. చేయించిన తరువాతనే తీసుకుంటాం. అలాకాకుంటే, వెంటనే డిస్ క్వాలిఫై చేయాలని మీకు విన్నవించుకుంటున్నా అధ్యక్షా" అని జగన్ అన్నారు.