Ram Madhav: రామ్ మాధవ్ తో భేటీ అయిన కోమటిరెడ్డి సోదరులు!
- పార్క్ హయత్ హోటల్ లో రామ్ మాధవ్ మకాం
- కలిసి చర్చించిన పలువురు నేతలు
- త్వరలోనే రానున్న స్పష్టత
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలేలా ఉంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడంతో పాటు ఆ పార్టీ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేయగా, ఇప్పుడు మరికొందరు నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న పలువురు తెలంగాణ నేతలు ఆ పార్టీ నాయకులతో రహస్య మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.
నిన్న బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిలతో పాటు టీఆర్ఎస్ మాజీ ఎంపీ వివేక్, కల్వకుంట్ల రమ్యారావులు భేటీ అయినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కనుమరుగయ్యే దశలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ కోలుకునే అవకాశం లేకపోవడంతోనే వీరు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.
ఇదిలావుండగా, తాను బీజేపీ వైపు చూస్తున్నట్టు వచ్చిన వార్తలను కోమటిరెడ్డి ఖండించారు. రామ్ మాధవ్ తో తాను చర్చలు జరపలేదని, దీనిపై వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని తెలిపారు.
కాగా, తెలంగాణలో అసంతృప్తి నేతలను ఆకర్షించే పనిని బీజేపీ అధిష్ఠానం రామ్ మాధవ్ పై మోపగా, ఆయన హైదరాబాద్ కు వచ్చి, పార్క్ హయత్ హోటల్ లో మకాం వేసి, పలువురు నాయకులతో చర్చలు సాగించినట్టు తెలుస్తోంది. ఇక ఎవరెవరు బీజేపీలో చేరుతారన్న విషయం మరో రెండు మూడు రోజుల్లో తేలుతుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి.