Heat: తగ్గని ఎండలు... హైదరాబాద్ లో అల్లాడుతున్న విద్యార్థులు!
- గాలిలో తగ్గిన తేమ శాతం
- సాధారణం కన్నా మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత
- మరో మూడు రోజులు ఇంతే!
ఒకటి, రెండు సార్లు వర్షాలు కురిసినా హైదరాబాద్ లో ఎండ మంట తగ్గలేదు. ముఖ్యంగా మధ్యాహ్నం పూట రికార్డు స్థాయిలోనే ఉష్ణోగ్రత నమోదవుతోంది. పగలు గరిష్ఠంగా 40.3 డిగ్రీల వరకూ, రాత్రి వేళల్లో 29 డిగ్రీల వరకూ వేడి నమోదవుతోంది. ఇది సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల వరకూ అధికమని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.
కాగా, గాలిలో తేమశాతం తక్కువ స్థాయిలో ఉండటంతో ప్రజలు ఉక్కపోతను అనుభవిస్తున్న పరిస్థితి. మరో రెండు మూడు రోజుల పాటు ఇదే తరహాలో వాతావరణ పరిస్థితి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిన్న రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభం కాగా, స్కూలుకు వెళుతున్న విద్యార్థుల పరిస్థితి మరింత ఇబ్బందిగా ఉంది. ఎండ వేడిమికి పిల్లలు తట్టుకోలేక అల్లాడుతున్నారు
మరోవైపు నైరుతి రాక ఆలస్యం కావడం కూడా ఎండ అధికంగా ఉండేలా చేస్తోంది. వాస్తవానికి ఈ సమయానికి రుతుపవనాలు తెలంగాణను తాకాల్సివున్నప్పటికీ, అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు తుపాను నైరుతిని తనవైపు లాగేసుకుంది. ఫలితంగా మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి.