Vayu: 'వాయు'గండం... కూలిన సోమనాథ్ ఆలయ ప్రవేశద్వారం!
- అరేబియాలో వాయు తుపాను
- నేటి మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం
- కుప్పకూలిన వందలాది చెట్లు
- నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు
అరేబియా సముద్రంలో నెలకొన్న వాయు తుపాను గుజరాత్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే గంటకు 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండగా, ఆ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో పరిస్థితి భీతావహంగా ఉందని తెలుస్తోంది.
ఈదురుగాలుల ధాటికి వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ప్రఖ్యాత సోమనాథ్ ఆలయం ప్రవేశద్వారం కుప్పకూలగా, అక్కడి షెడ్లు గాలికి ఎగిరిపోయాయి. ప్రస్తుతం గుజరాత్ కు 140 కిలోమీటర్ల దూరంలో తుపాన్ కేంద్రీకృతమై ఉండగా, ఇవాళ మధ్యాహ్నానికి తీరం దాటవచ్చని అంచనా. తీరం దాటే సమయంలో తుపాను ప్రభావం చాలా అధికంగా ఉంటుందని, ప్రజలు పూర్తి అప్రమత్తతతో ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. పోర్ బందర్, మహువా మధ్య 'వాయు' తీరం దాటుతుందని వెల్లడించారు.