Andhra Pradesh: ఇచ్చిన హామీని ముందుగానే అమలు చేయనున్న సీఎం జగన్: కురసాల కన్నబాబు
- రెండో ఏడాది నుంచి ‘రైతు భరోసా’ ఇద్దామనుకున్నాం
- కానీ, ముందుగానే అమలు చేస్తాం
- ఎన్నికలకు ముందు బాబు ఎన్నో గిమ్మిక్కులు చేశారు
సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన హామీని ముందుగానే అమలు చేస్తున్నారని ఏపీ వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రశంసించారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి ఆయన మాట్లాడుతూ, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో ఏడాది నుంచి ‘రైతు భరోసా’ పథకాన్ని అమలు చేస్తామని నాడు జగన్ హామీ ఇచ్చారని, అయితే, చెప్పిన గడువు కన్నా ముందుగానే ఈ ఏడాది అక్టోబర్ నుంచే ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు వివరించారు. రైతుల పరిస్థితి చూసి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ‘రైతు భరోసా’ను కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామని, 15 లక్షల మంది కౌలు రైతులకు కూడా రూ.12,500 ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు.
ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్నో గిమ్మిక్కులు చేశారని, రైతులు, మహిళలు, ఇలా ప్రతి ఒక్కరినీ మోసం చేసే ప్రయత్నం చేశారని కన్నబాబు ఆరోపించారు. ఎన్నికలకు ముందు హడావుడిగా అన్నదాత సుఖీభవ పథకం ప్రవేశపెట్టాల్సిన అవసరమేంటంటూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబు తన హయాంలో రైతులకు చేసిందేమీ లేదని, రైతు రుణమాఫీలో అనేక కోతలు పెట్టారని అన్నారు. పౌరసరఫరాల శాఖ తెచ్చిన రుణాన్ని ఇతర అవసరాల కోసం చంద్రబాబు మళ్లించారని, రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి ఇంతవరకూ డబ్బులు చెల్లించలేదని మంత్రి ఆరోపించారు.