Road Accident: మధ్యప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ కానిస్టేబుల్, నిందితుడు మృతి
- ఎస్‌ఐ, మరో మహిళా కానిస్టేబుల్‌కు గాయాలు
- హైదరాబాద్ కమిషనరేట్ పరిధి మైలార్‌దేవ్‌పల్లి ఠాణాకు చెందిన ఉద్యోగులు
- మధ్యప్రదేశ్‌లో జరిగిన ప్రమాదం
విధి నిర్వహణపై వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకుని బీహార్ నుంచి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధి మైలార్‌దేవ్‌పల్లి ఠాణాకు చెందిన ఓ కానిస్టేబుల్‌తోపాటు నిందితుడు మృతి చెందారు. ఎస్‌ఐ, మరో మహిళా కానిస్టేబుల్ గాయపడ్డారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం డిండోరి జిల్లా సమన్‌పూర్ వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనం చక్రం ఊడిపోవడంతో బండి అదుపుతప్పి ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో కానిస్టేబుల్ తులసీరామ్, నిందితుడు రమేష్‌నాయక్‌లకు బలమైన గాయాలు కావడంతో వారు అక్కడికక్కడే చనిపోయారు. ఎస్‌ఐ రవీందర్‌నాయక్, మహిళా కానిస్టేబుల్ లలితకు గాయాలయ్యాయి. మైలార్‌దేవ్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో రమేష్‌నాయక్ నిందితుడు. ఘటనానంతరం పరారయ్యాడు. అతను బీహారులో ఉన్నాడన్న సమాచారం మేరకు ఎస్‌ఐ రవీందర్, కానిస్టేబుళ్లు తులసీరామ్, లలిత బృందం బయలుదేరి బీహార్ వెళ్లారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని తిరిగి వస్తుండగా మధ్యప్రదేశ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. మృతిచెందిన కానిస్టేబుల్ తులసీరామ్ స్వస్థలం రంగారెడ్డి జిల్లా ధరూర్. 2018లోనే కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు.