Pankaj Kumar Singh: బీహార్ లో జేడీయూ నేతపై కాల్పులు
- 18 రౌండ్ల కాల్పులు జరిపి పరారైన దుండగులు
- పంకజ్‌ను ఆసుపత్రికి తరలించిన స్థానికులు
- శరీరం నిండా బుల్లెట్లేనన్న వైద్యులు
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనతాదళ్ (యూ) పార్టీ నుంచి బీహార్ లోని సీతమర్రి లోక్ సభ స్థానానికి నామినేషన్ వేసి, అనంతరం విరమించుకున్న వ్యక్తిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. సీతమర్రి జిల్లాలోని రాజ్‌పూర్ గ్రామానికి చెందిన పంకజ్ కుమార్ సింగ్ అనే వ్యక్తిపై శనివారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో 18 రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న పంకజ్‌ను గుర్తించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు 7 గంటల పాటు శ్రమించి పంకజ్ శరీరంలోని బుల్లెట్లను తొలగించారు.
ఈ విషయమై డాక్టర్ వరుణ్ కుమార్ మాట్లాడుతూ, పంకజ్ శరీరంలో ఎక్కడ చూసినా బుల్లెట్లే ఉన్నాయని, కాళ్లు, చేతులు, ఉదరం, చాతి అనే తేడా లేకుండా శరీరం మొత్తం తుపాకీ గుళ్లతో నిండిపోయిందని అన్నారు. అదే సమయంలో ఆయన బీపీ చాలా వరకూ పడిపోయిందని, ఊపిరితిత్తుల నుంచి రక్తం కారుతోందని అన్నారు. అతడి శరీరం నుంచి బుల్లెట్లు తీయడానికి దాదాపు ఏడు గంటల పాటు శ్రమించాల్సి వచ్చిందని వరుణ్ కుమార్ తెలిపారు. అయితే పంకజ్‌పై కొన్ని క్రిమినల్ కేసులున్నాయని, గతంలో ఆయన జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చినట్టు తెలిపారు.