Virat Kohli: అభిమానుల దురుసు ప్రవర్తన... స్టీవ్ స్మిత్ కు క్షమాపణలు చెప్పిన విరాట్ కోహ్లీ!
- బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్
- 'చీటర్ చీటర్' అని కేకలు పెట్టిన ఫ్యాన్స్
- దగ్గరికి వచ్చి మందలించిన కోహ్లీ
భారత క్రికెట్ అభిమానుల దురుసు ప్రవర్తన పట్ల ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కు విరాట్ కోహ్లీ క్షమాపణలు చెప్పాడు. నిన్న జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన జరుగగా, తనలోని క్రీడాస్ఫూర్తిని కోహ్లీ మరోసారి చాటుకున్నాడని పలువురు కితాబిస్తున్నారు.
ఇంతకీ అసలేం జరిగిందంటే, భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్ ను ఉద్దేశించి ఫ్యాన్స్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ట్యాంపరింగ్ వివాదాన్ని ప్రస్తావిస్తూ చీటర్... చీటర్... అని కేకలు పెట్టారు. దీన్ని గమనించి కోహ్లీ, బౌండరీ రోప్ వరకూ వచ్చి, అలా చేయవద్దంటూ అభిమానులను మందలించాడు. చప్పట్లు కొట్టి ప్రోత్సహించాలని సైగ చేస్తూ, వెనక్కు వెళ్లాడు. తనకు ఎదురు వచ్చిన స్మిత్ కు క్షమాపణలు చెప్పాడు. స్మిత్ సైతం కోహ్లీని భుజం తట్టి అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ విడుదల చేసింది.
కాగా, మ్యాచ్ పూర్తయిన తరువాత మీడియాతో మాట్లాడిన కోహ్లీ, భారత అభిమానుల తరఫున తానే స్వయంగా స్టీవ్ స్మిత్ కు క్షమాపణలు చెప్పానని అన్నాడు. జరిగిందేదో జరిగిపోయిందని, అతను పునరాగమనం చేసి, దేశం కోసం పోరాడుతున్నాడని గుర్తు చేశాడు. స్మిత్ ను ఇలా గేలి చేయడం తాను చూశానని, ఒకరిని కించపరచడం మంచిది కాదని అన్నాడు. గతంలో తనకూ, స్మిత్ కు మధ్య విభేదాలు ఉండవచ్చని, వాదనలకు దిగుండవచ్చని, అయితే, అతని బాధ నుంచి వచ్చే ఆటను మాత్రం చూడాలని అనుకోవడం లేదని కోహ్లీ వ్యాఖ్యానించాడు. భారత అభిమానులు చెత్త ఉదాహరణగా మిగలరాదని సూచించాడు.