sr nagar: ఎస్ఆర్ నగర్ లో ప్రేమజంటపై దాడి కేసు.. ఆరుగురు నిందితుల అరెస్టు
- ప్రేమ పెళ్లి చేసుకున్న ఇంతియాజ్, జైనాబ్ ఫాతిమా
- ఇంతియాజ్ పై దాడి చేసింది జైనాబ్ తల్లిదండ్రులు, బంధువులే
- వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్
హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ లో ఓ ప్రేమ జంటపై రెండు రోజుల క్రితం దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్టు వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలిపారు.
సంగారెడ్డికి చెందిన షేక్ ఇంతియాజ్, బోరబండకు చెందిన జైనాబ్ ఫాతిమా కొంతకాలంగా ప్రేమించుకున్నారని, ఇంట్లో పెద్దలు అడ్డు చెప్పడంతో రంజాన్ పండగ రోజున సదాశివపేటలోని దర్గాలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు చెప్పారు. తమ కుమార్తె కనిపించడం లేదని జైనాబ్ తండ్రి ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారని అన్నారు. తమ కుటుంబసభ్యుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఇంతియాజ్, జైనాబ్ లు సంగారెడ్డి పోలీసులను ఆశ్రయించారని, ఈ విషయాన్ని ఇరువురి కుటుంబసభ్యులతో పాటు ఎస్ ఆర్ నగర్ పోలీసులకు సంగారెడ్డి పోలీసులు తెలియజేశారని అన్నారు.
ఎస్ ఆర్ నగర్ పోలీసులు సంగారెడ్డికి వెళ్లి జైనాబ్ ను తీసుకొచ్చి వారి తల్లిదండ్రులకు అప్పజెప్పారని చెప్పారు. తమ కుమార్తెను తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో ఇంతియాజ్ పై జైనాబ్ కుటుంబ సభ్యులు దాడికి ప్లాన్ చేశారని, ఈ నేపథ్యంలో అతనికి జైనాబ్ తండ్రి ఫోన్ చేసి, తమ ఇంటికి వచ్చి ఆమెను తీసుకెళ్లమని కోరారని అన్నారు. అయితే, తమ మామ చెప్పిన మాటలను ఇంతియాజ్ నమ్మకపోవడంతో వెళ్లలేదని చెప్పారు. ఇంతియాజ్ కు అతని మామ మళ్లీ ఫోన్ చేసి, ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు రావాలని, తన కూతురును బాగా చూసుకుంటానని పోలీసుల సమక్షంలో లిఖితపూర్వకంగా రాసిచ్చి తీసుకెళ్లమని చెప్పినట్టు తెలిపారు.
ఈ మాటలు నమ్మిన ఇంతియాజ్ తన తల్లిదండ్రులను వెంట తీసుకుని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడని చెప్పారు. ఇంతియాజ్ తన మామ చెప్పినట్టు లిఖితపూర్వకంగా రాసిచ్చి జైనాబ్ ను వెంట తీసుకుని, తల్లిదండ్రులతో కలిసి తన క్వాలిస్ వాహనంలో సంగారెడ్డి బయలుదేరి వెళుతుండగా వారిపై దాడి జరిగిందని చెప్పారు. ఇంతియాజ్ వాహనాన్ని జైనాబ్ తల్లిదండ్రులు మోసిన్ అలీ, జకీరా బేగం, వారి బంధువులు వెంబడించి ఐసీఐసీఐ బ్యాంకు సమీపంలో ఆ వాహనాన్ని అడ్డుకున్నారని చెప్పారు. వాహనం దిగి పారిపోయేందుకు యత్నించిన ఇంతియాజ్ పై విచక్షణా రహితంగా కత్తులతో వారు దాడి చేశారని వివరించారు. దాడి అనంతరం నిందితులు ఆటోలో పారిపోయారని చెప్పారు. హత్యయత్నం కేసు నమోదు చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని, పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్టు డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ చెప్పారు.