Jason Roy: సెంచరీ పూర్తిచేసి అంపైర్‌ను ఢీకొట్టిన జాసన్ రాయ్.. నవ్వులే నవ్వులు!
- బంతివైపు చూస్తూ పరుగులు పెట్టిన రాయ్
- ఎటో చూస్తున్న అంపైర్
- ఇద్దరూ కిందపడిన వేళ మైదానంలో నవ్వుల విరిజల్లు
ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో జాసన్ రాయ్ చేసిన పని స్టేడియంలో నవ్వులు పూయించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ రాయ్ రెచ్చిపోవడంతో 386 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ అయిన రాయ్ 121 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సర్లతో 153 పరుగులు చేశాడు. వన్డేల్లో రాయ్‌కి ఇది తొమ్మిదో సెంచరీ.
కాగా, 92 బంతులు ఎదుర్కొన్న రాయ్ సెంచరీ పూర్తి చేసిన వేళ మైదానంలో జరిగిన ఓ ఘటన నవ్వులు పూయించింది. ముస్తాఫిజుర్ వేసిన బంతిని డీప్ స్క్వేర్‌లెగ్‌లోకి తరలించిన రాయ్.. బంతి వైపు సెంచరీ కోసం పరుగు పెట్టాడు. ఈ క్రమంలో నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న అంపైర్ జోయెల్ విల్సన్‌ను పొరపాటున ఢీకొట్టాడు. దీంతో ఇద్దరూ కిందపడ్డారు. తనవైపు వస్తున్న రాయ్‌ను గుర్తించకుండా అంపైర్ ఎటో చూస్తుండడంతో రాయ్ వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఇద్దరూ కిందపడిన వేళ మైదానంలోని ప్రేక్షకులతోపాటు పెవిలియన్‌లో ఉన్న ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా నవ్వాపుకోలేకపోయారు.