Mahabubabad District: చిన్న వయసులోనే పెద్ద పదవి : మహబూబాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్‌గా 23 ఏళ్ల బిందు
- హైదరాబాద్ సీబీఆర్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి
- రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మహిళ
- తాత, తండ్రి, తల్లి, పిన్నమ్మ అంతా ప్రజాప్రతినిధులే
తెలంగాణ స్థానిక ఎన్నికల్లో మహబూబాబాద్ జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కేవలం 23 ఏళ్లకే జెడ్పీ చైర్‌పర్సన్ పదవి యువతిని వరించింది. ఇంజనీరింగ్ పట్టభద్రురాలైన అంగోతు బిందు ఈ అరుదైన రికార్డు తన సొంతం చేసుకున్నారు. బయ్యారం జెడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికైన బిందుకు ఏకంగా చైర్‌పర్సన్ పదవి దక్కడం గమనార్హం. తాతగారి హయాం నుంచి రాజకీయ కుటుంబం కావడంతో చిన్న వయసులోనే బిందును కూడా పదవి వరించింది.
తన చిన్నమ్మ, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని బిందు తెలిపారు. బిందు కుటుంబం మొదటి నుంచి రాజకీయాల్లో ఉంది. ఆమె తాతగారి పేరుతోనే ఊరు బాల్యతండా కొనసాగుతోంది. బిందు తల్లి అంగోతు కాంతి ఎంపీటీసీ సభ్యురాలిగా పనిచేశారు. ఈ సందర్భంగా బిందు మాట్లాడుతూ ‘రాజకీయ కుటుంబం కావడంతో నా చిన్నప్పటి నుంచి రాజకీయాలు గమనిస్తున్నాను. అమ్మ, నాన్న, పిన్నమ్మ...ప్రజాప్రతినిధులు కావడంతో వారి జీవనశైలి గమనిస్తూ రావడం వల్ల నాకు కూడా రాజకీయాలపై ఆసక్తి ఏర్పడింది. అందుకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజలు నన్ను ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించినందున వారికి సేవచేసి రుణం తీర్చుకుంటాను' అని తెలిపారు.