Railways: నారాయణాద్రి, వెంకటాద్రి సహా పలు రైళ్లలో స్లీపర్ బోగీల తగ్గింపు!
- ప్రతి రైలులో ఒక్కో బోగీ తగ్గింపు
- స్లీపర్ బోగీల స్థానంలో ఏసీ బోగీలు
- ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నంలో రైల్వే శాఖ
- అభ్యంతరం చెబుతున్న ప్రయాణికులు
ఓ వైపు రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత పెరిగిపోయి, అదనపు స్లీపర్ బోగీలను ఏర్పాటు చేయాలని సామాన్య ప్రయాణికులు డిమాండ్ చేస్తుంటే, ఉన్న బోగీలనే తొలగించే పనిలో రైల్వే శాఖ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వెంకట్రాది ఎక్స్ ప్రెస్, నారాయణాద్రి, గౌతమి, సింహపురి, దేవగిరి ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఒక్కో స్లీపర్ బోగీని తగ్గించాలని, త్వరలో మరికొన్ని రైళ్లలో నుంచి కూడా స్లీపర్ బోగీలను తగ్గించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. వీటి స్థానంలో రైల్వేలకు అధిక ఆదాయాన్ని ఇచ్చేలా ఏసీ బోగీలను జోడించాలన్నది రైల్వే శాఖ యత్నం.
కాగా, నిత్యమూ హైదరాబాద్ నుంచి తిరుపతికి సగటున 9 రైళ్లు నడుస్తుండగా, వాటిల్లో సరాసరి 150 వరకూ వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. తాజాగా రైల్వే శాఖ నిర్ణయంతో మరో 80 మందికి (72 బెర్తులు, 8 ఆర్ఏసీ) బెర్త్ లు కన్ఫార్మ్ అయ్యే పరిస్థితి లేదు. దీంతో సాధారణ ప్రయాణికులు మరింత కష్టపడాల్సి వస్తుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి స్లీపర్ బోగీలో బెర్త్ కు రూ. 370 ఉండగా, ఏసీ బోగీలో అయితే కనీసం రూ. 1000 వరకూ చెల్లించాల్సి వుంటుంది. స్లీపర్ బోగీలు తొలగించి ఏసీ బోగీలు తగిలించడం వల్ల సాధారణ ప్రజలకు లాభం ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయం అర్ధం లేనిదని, సామాన్యులు వెళ్లే స్లీపర్ బోగీలనే పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.