Air Force: గల్లంతైన విమానం ఆచూకీ ఇస్తే.. రూ. 5 లక్షల నజరానా: ఐఏఎఫ్
- ఈ నెల 3న అరుణాచల్‌ప్రదేశ్‌లో అదృశ్యమైన విమానం
- వారం రోజులైనా కనిపించని ఆనవాళ్లు
- కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
ఈ నెల 3న అరుణాచల్‌ప్రదేశ్‌లో 13 మంది సిబ్బందితో అదృశ్యమైన భారత వాయుసేన విమానం ఎన్-32కు సంబంధించిన సమాచారం అందిస్తే రూ.5 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. విమానం అదృశ్యమైనప్పటి నుంచీ విస్తృతంగా గాలిస్తున్నప్పటికీ విమానానికి సంబంధించి చిన్నపాటి ఆధారాలు కూడా లభించకపోవడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.
దీంతో విమానం ఆచూకీ గురించి తెలిస్తే చెప్పాలంటూ మూడు ఫోన్ నంబర్లు 0378-3222164, 9436499477, 9402077267, 9402132477 విడుదల చేసింది. ఈ నంబర్లకు ఫోన్ చేసి కచ్చితమైన సమాచారం చెప్పేవారికి రూ.5 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ ఎయిర్ మార్షల్, ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఆర్‌డీ మాథుర్ ప్రకటించారు.
మరోవైపు, సెర్చ్ ఆపరేషన్ కొనుగుతూనే ఉందని వింగ్ కమాండర్ రత్నాకర్ సింగ్ తెలిపారు. విమానం గాలింపు కోసం ఆర్మీ, అరుణాచల్‌ప్రదేశ్ అధికారులు, ఇతర సంస్థలు కూడా రంగంలోకి దిగినట్టు చెప్పారు.