Professor: అత్యాచారం జరిగిందన్న మహిళ.. అవాస్తవమని తేల్చిన కోర్టు
- మహిళకు లింక్డ్ఇన్‌లో పరిచయమైన వ్యక్తి
- పార్టీ ఇస్తానంటూ హోటల్‌కు ఆహ్వానం
- 3 నెలల తర్వాత తనపై అత్యాచారం జరిగిందని కేసు
తనపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడంటూ ఢిల్లీకి చెందిన ఓ మహిళ వేసిన కేసును కోర్టు కొట్టివేసింది. సదరు మహిళ వాదనలో వాస్తవం లేదని తేల్చింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే, ఢిల్లీకి చెందిన ఓ మహిళా ప్రొఫెసర్‌కు ఓ వ్యక్తి లింక్డ్ ఇన్‌లో పరిచయమయ్యాడు. క్రమంగా వారి మధ్య స్నేహం బలపడటంతో అతను ఆమెను పార్టీ ఇస్తానంటూ ఓ హోటల్‌కు ఆహ్వానించాడు. అతడు చెప్పిన చోటుకు ఆమె వెళ్లింది.
ఇది జరిగిన మూడు నెలల తరువాత అతడు తనను హోటల్‌కు రమ్మని, తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ నిర్వహించిన పోలీసులు వారి కాల్ డేటా, వాట్సాప్, లింక్డ్‌ఇన్ మెసేజ్‌లను పరిశీలించి షాక్ అయ్యారు. తనపై అత్యాచారం జరిగిందని మహిళ పేర్కొన్న రోజున ఆమె నుంచి అతడికి 529 కాల్స్ వెళ్లాయి.
అత్యాచారం జరిగిన వెంటనే కాకుండా 3 నెలల తరువాత ఆమె ఫిర్యాదు చేయడంపై అనుమానాలు తలెత్తాయి. ఈ ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేకపోయింది. వీటన్నింటినీ పరిశీలించిన ట్రయల్ కోర్టు ఆమె ఆరోపణల్లో నిజం లేదని తేల్చింది. అతడిని నిర్దోషిగా తేల్చి విడుదల చేసింది. దీంతో సదరు మహిళ తిరిగి పైకోర్టులో అప్పీలు చేసింది. అయితే ఆ కోర్టు కూడా ఆమె వాదనను తోసిపుచ్చడమే కాకుండా, కింది కోర్టు తీర్పును సమర్థిస్తూ ఆమె అప్పీలును కొట్టి వేసింది.