KCR: కేసీఆర్ ఓ పొలిటికల్ టెర్రరిస్టుగా మారాడు: భట్టి విక్రమార్క
- రాష్ట్రంలో మరో పార్టీ ఉండకూడదని కేసీఆర్ కోరుకుంటున్నారు
- ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసమే ఆమరణ దీక్ష
- అవినీతిని ప్రశ్నించేవాళ్లు ఉండకూడదని అనుకుంటున్నారు
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నాడంటూ మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఆమరణ దీక్షకు దిగారు. ఇక్కడ, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ సత్యాగ్రహ దీక్షకు పిలుపునిచ్చింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసమే ఈ ఆమరణదీక్ష అని తెలిపారు. సీఎల్పీ విలీనం ద్వారా ప్రజాస్వామ్యాన్ని చంపేశారని చెప్పడానికి ఇంతకుమించి ఉదాహరణ మరేదీ అక్కర్లేదని అన్నారు. ఇలాంటివి చూడ్డానికేనా తెలంగాణ కోసం పోరాడింది? అని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ తన ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాల ద్వారా ఓ పెద్ద పొలిటికల్ టెర్రరిస్టుగా పరిణమించారని మండిపడ్డారు. రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ ఉండకూడదని కేసీఆర్ భావిస్తున్నారని ఆరోపించారు.
నీటిపారుదల ప్రాజక్టుల్లో చోటు చేసుకున్న కుటుంబ అవినీతిని ప్రశ్నించేవాళ్లు ఉండకూడదనే కాంగ్రెస్ పార్టీని నాశనం చేయాలని కేసీఆర్ సంకల్పించాడని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. "కేసీఆర్... 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పశువుల్లాగా కొన్నప్పటికీ, రాష్ట్రంలోని లక్షల మంది కాంగ్రెస్ అభిమానుల అండతో నీ అవినీతిని కక్కిస్తాం, నీ అంతు తేలుస్తాం" అంటూ సవాల్ విసిరారు.