APSRTC: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సీఎం జగన్ సుముఖంగా ఉన్నట్టు రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారు: కార్మిక సంఘాలు
- విలీనంపై త్వరలోనే కమిటీ
- ఆర్టీసీ ఆర్థికస్థితిపై అధ్యయనం
- సీఎంను కలుస్తాం
రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఇవాళ ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చర్చలు జరిపింది. రాష్ట్ర రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబుతో కార్మిక సంఘాల నేతలు సమావేశమయ్యారు. చర్చలు ఫలప్రదంగా ముగిశాయని సమావేశం అనంతరం జేఏసీ నేతలు తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసేందుకు సీఎం జగన్ సుముఖంగా ఉన్నారని రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారని కార్మిక సంఘాల నేతలు మీడియాకు వెల్లడించారు.
ఆర్టీసీ విలీనంపై త్వరలో ప్రభుత్వం కమిటీ వేయనుందని, ఈ కమిటీ ఆర్టీసీ ఆర్థిక స్థితిగతులను కూడా అంచనా వేస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయని నేతలు వివరించారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని, త్వరలోనే ముఖ్యమంత్రిని కలుస్తామని వారు పేర్కొన్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ జేఏసీ ఈనెల 13న రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.