India: భారత్ కు అమెరికా బంపర్ ఆఫర్.. సాయుధ డ్రోన్లు, మిస్సైల్ టెక్నాలజీ అమ్ముతామని ప్రకటన!
- ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన అమెరికా
- థాడ్, పేట్రియాట్ వ్యవస్థలు అమ్ముతామని ఆఫర్
- రష్యాతో ఎస్-400 ఒప్పందంపై గుర్రుగా ఉన్న అగ్రరాజ్యం
అగ్రరాజ్యం అమెరికా భారత్ కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. శత్రువుల స్థావరాలను తుత్తునియలు చేసే సాయుధ డ్రోన్లను, క్షిపణి నిరోధక వ్యవస్థ టెక్నాలజీని ఇండియాకు అమ్మడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకే అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణరంగ నిపుణుడు ఒకరు తెలిపారు. అమెరికా ఇప్పటికే నిఘాకు వాడే గార్డియన్ డ్రోన్లను భారత్ కు అమ్ముతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ఈ విషయమై వైట్ హౌస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఇండియాకు థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థ, పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థ అమ్మకానికి, టెక్నాలజీ బదిలీకి అమెరికా సిద్ధంగా ఉందని తెలిపారు. 2016లో అమెరికా భారత్ ను ప్రధాన రక్షణ భాగస్వామి హోదా ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అప్పటి నుంచి భారత్ కు ఎంహెచ్60ఆర్ సీహాక్ హెలికాప్టర్లు, అపాచీ హెలికాప్టర్లు, పీ-8ఐ నిఘా, గస్తీ విమానాలు, ఎం777 హోవిట్జర్ శతఘ్నులను అమెరికా అమ్మిందని చెప్పారు.
అమెరికా ఆయుధాలు, టెక్నాలజీ కొనుగోలు విషయంలో భారత్ దే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. ఇండియా ఇటీవల రూ.40,000 కోట్లతో రష్యానుంచి అత్యాధునిక ఎస్-400 క్షిపణి నిరోధక వ్యవస్థ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. దీన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రష్యాతో ఆయుధాలు, మిలటరీ టెక్నాలజీ కొనుగోలు చేసే దేశాలపై క్యాస్టా చట్టం ప్రకారం తీవ్రమైన ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తోంది.