RBI: మూతపడుతున్న ఏటీఎంలు...నగదు కొరతతో రెండేళ్లలో 597కి తాళాలు
- నగదు జమ చేసే వారి కంటే ఉపసంహరణ రేటు అధికం
- దీంతో నగదు కొరత తప్పనిసరి అవుతోంది
- మరోవైపు నిర్వహణ భారం కారణంగా కొన్ని మూత
బ్యాంకులతో సంబంధం లేకుండా ఖాతాదారులకు సెల్ఫ్ సర్వీస్ కోసం అమల్లోకి వచ్చిన ఎనీ టైమ్ మనీ (ఏటీఎం) కేంద్రాలు నగదు కొరత కారణంగా మూతపడుతున్నాయని ఆర్‌బీఐ గుర్తించింది. గడచిన రెండేళ్ల కాలంలో ఈ విధంగా మూతపడిన వాటి సంఖ్య 597 వరకు ఉందని గుర్తించింది. ఖాతాదారులు జమ చేసే మొత్తం కంటే విత్‌డ్రాలు ఎక్కువగా ఉండడంతో నగదు కొరత సమస్య తప్పడం లేదు. కొన్ని బ్యాంకులు నిర్వహణ భారాన్ని భరించలేక తమ ఏటీఎంలను మూసి వేస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నివేదికలో పేర్కొంది.
2017లో దేశవ్యాప్తంగా 2 లక్షల 22 వేల 300 ఏటీఎంలు ఉండగా, 2019 నాటికి వీటి సంఖ్య 2,21,703కి పడిపోయింది. 2012 తర్వాత బ్యాంకు ఏటీఎంల విస్తరణ రేటును పెంచాయి. అప్పట్లో ప్రతీ 10,832 మందికి ఒక ఏటీఎం అందుబాటులో ఉండగా, 2017 నాటికి ప్రతీ 5,919 మంది ఖాతాదారులకు ఒక ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. ఈ ఐదేళ్ల కాలంలో తమ బ్యాంకు ఏటీఎంలను విస్తరించడానికి యాజమాన్యాలు ఎంతో ప్రయత్నించాయి. చిత్రంగా ఆ తర్వాత ఏటీఎంల సంఖ్య తగ్గిపోవడం మొదలయ్యింది. దీనికి నగదు కొరతే కారణమని భావిస్తున్నారు.