Jagan: జగన్ క్యాబినెట్ లో చోటు దక్కడంపై పినిపె విశ్వరూప్ స్పందన
- మంత్రివర్గ కూర్పు అన్నివర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంది
- సమస్యలనేవి ఎప్పుడూ ఉంటాయి
- అందరినీ కలుపుకుని వెళతా
నవ్యాంధ్రప్రదేశ్ లో రేపు కొత్త క్యాబినెట్ ప్రమాణస్వీకారం చేయనుంది. సీఎం జగన్ తనకు కావాల్సిన టీమ్ ను అనేక కసరత్తులు చేసి స్వయంగా ఎంపిక చేసుకున్నారు. రోజా, భూమన వంటి సీనియర్లకు నిరాశ కలిగించేలా క్యాబినెట్ కూర్పు ఉన్నా, జగన్ మాత్రం తాను నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, జగన్ క్యాబినెట్ లో చోటు దక్కించుకున్న అమలాపురం శాసనసభ్యుడు పినిపె విశ్వరూప్ ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నారు.
దీనిపై ఆయన మాట్లాడుతూ, జగన్ క్యాబినెట్ కూర్పు అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచే విధంగా ఉందని అన్నారు. అయితే, సమస్యలనేవి ఎప్పుడూ ఉంటాయని అసంతృప్తుల గురించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. తన గురించి చెబుతూ, గతంలో తాను మంత్రిగా వ్యవహరించానని, ఆ అనుభవం ఇప్పుడు అక్కరకొస్తుందని భావిస్తున్నానని తెలిపారు. రెండున్నరేళ్లు మంత్రిగా, ఆపై రెండున్నరేళ్లు పార్టీ కోసం పనిచేయాలన్న జగన్ సిద్ధాంతం ఆకట్టుకునేలా ఉందన్నారు. ఏ ప్రభుత్వం చేయని రీతిలో ఎస్సీలు, బీసీలతో పాటు అన్ని వర్గాలకు జగన్ ప్రాధాన్యత ఇచ్చారని విశ్వరూప్ కొనియాడారు. మంత్రిగా నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో అందరినీ కలుపుకుని వెళ్లడంపై దృష్టిపెడతానని స్పష్టం చేశారు.