Madhya Pradesh: తన కార్యాలయంలోని ఏసీలను చిన్నారుల పునరావాస కేంద్రాలకు ఇచ్చేసిన జిల్లా కలెక్టర్

  • మధ్యప్రదేశ్ లో ఘటన
  • చిన్నారుల అవస్థలు చూసి చలించిపోయిన కలెక్టర్
  • అందరికీ స్ఫూర్తిదాయకంగా మారిన వైనం

మధ్యప్రదేశ్ లోని ఉమరియా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన వారికి అక్కడి పరిస్థితి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. జిల్లాకు సర్వాధికారి వంటి కలెక్టర్ ఎంతో సాదాసీదాగా ఫ్యాన్ కింద పనిచేసుకుంటూ కనిపిస్తారు. జిల్లా కలెక్టర్ అంటే చాంబర్ లో ఏసీలు ఉండడం సహజం. కానీ, ఉమరియా జిల్లా కలెక్టర్ స్వారోచిష్ సోమవంశీ మాత్రం తన చాంబర్ లో ఏసీలను ఓ పోషకాహార పునరావాస కేంద్రానికి ఇచ్చేశారు.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం పోషకాహార లోపంతో బాధపడే చిన్నారుల కోసం స్పెషల్ డ్రయివ్ చేపట్టింది. అందులో భాగంగా పోషకాహార పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇటీవలే ఓ కేంద్రాన్ని కలెక్టర్ సోమవంశీ తనిఖీ చేసి అక్కడి చిన్నారులు వేసవి తాపానికి అల్లాడిపోతున్న వైనాన్ని కళ్లారా చూశారు. పెద్దవాళ్లే ఎండల తీవ్రత తట్టుకోలేని పరిస్థితుల్లో ఆ చిన్నారులు వేడికి ఉడికిపోతుండడం పట్ల ఆయన చలించిపోయారు.

వెంటనే తన చాంబర్ లోని ఏసీలను తెప్పించి ఆ పోషకాహార పునరావాస కేంద్రంలో అమర్చారు. ఏసీ చల్లదనంలో ఆ చిన్నారులు హాయిగా ఆడుకోవడం గమనించి ఆయన తృప్తిగా తన కార్యాలయానికి వెళ్లారు. ఆపై, తాను కేవలం ఫ్యాన్ గాలితోనే సరిపెట్టుకుంటూ విధులు నిర్వహిస్తూ మిగిలిన ఉన్నతాధికారులకు, సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు.

  • Loading...

More Telugu News