French Open: ఓడిన తండ్రికి కొడుకు ఓదార్పు... గెలిచిన ఆటగాడికీ ఆగని కన్నీరు... వీడియో వైరల్!

  • పారిస్ లో ఫ్రెంచ్ ఓపెన్ పోటీలు
  • పోరాడి ఓడిన స్థానిక ఆటగాడు నికోలస్ మహుత్
  • వైరల్ అవుతున్న వీడియో

ఏ మ్యాచ్ ఆడేవారైనా గెలవాలనే కోరుకుంటారు. ఓడిపోతే ఆ బాధను మాటల్లో చెప్పలేకపోతారు. ఇక అదే ఫ్రెంచ్ ఓపెన్ అయితే... గ్రాండ్ స్లామ్ గెలుచుకునేందుకు ఏడాదంతా శ్రమపడి వచ్చి ఓడిపోతే... పారిస్ లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ లో అదే జరిగింది. 2018 డబుల్స్ విజేత, స్థానిక ఆటగాడు నికోలస్ మహుత్ మూడో రౌండ్ లో అర్జెంటీనా ప్లేయర్ లియోనార్డో మేయర్ తో తలపడి పోరాడి ఓడిన వేళ, స్టేడియం యావత్తూ భావోద్వేగానికి లోనైంది.

మ్యాచ్ ముగిసిన తరువాత బెంచ్ పై కూర్చుని నికోలస్ కన్నీరు పెడుతుంటే, దాన్ని చూసి ఉండలేకపోయిన నికోలస్ కుమారుడు, ఏడేళ్ల నతనేల్ తన సీటు నుంచి లేచి, గోడదూకి, పరుగున వచ్చి, తండ్రిని హత్తుకుని ఏడ్చేశాడు. ఈ దృశ్యం వందలాది మంది ప్రేక్షకులను కదిలించింది. తండ్రీ కొడుకుల బంధాన్ని చూసి, ప్రతిఒక్కరూ చప్పట్లతో ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇక నికోలస్ పై గెలిచిన మేయర్ సైతం, వీరి అనుబంధాన్ని చూసి కంటతడి పెట్టాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. గెలుపైనా, ఓటమైనా అనుబంధాలకే విలువ అధికమని ఈ వీడియోను చూసిన వారంతా అంటున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News