Marriage: పెళ్లి ఖర్చుల నిమిత్తం బ్యాంక్ రుణం: ఇండియాలో తొలిసారిగా కోస్టల్ బ్యాంక్ కొత్త పథకం
- పేద, మధ్యతరగతి వర్గాల కోసం 'కల్యాణమస్తు'
- రూ. 50 లక్షల వరకూ రుణ సదుపాయం
- కోస్టల్ బ్యాంక్ ఎండీ వేణుగోపాల్ రెడ్డి
మీ ఇంట్లో వివాహం జరుగుతోందా? ఖర్చులకు డబ్బులు లేవని బాధపడుతున్నారా? మీ బాధను తీర్చడానికి కోస్టల్ బ్యాంక్ ముందుకు వచ్చింది. పెళ్లికి అవసరమైన డబ్బును రుణం రూపంలో అందిస్తామంటూ 'కల్యాణమస్తు' పథకాన్ని తీసుకొచ్చింది. ఇలా పెళ్లికి రుణమిస్తామని ఓ బ్యాంక్ చెప్పడం ఇదే తొలిసారి.
ఇప్పటివరకూ ఇల్లు, వాహనం కొనుగోలు, వ్యాపార, విద్యా రుణాలను బ్యాంకులు ఇస్తుండగా, కోస్టల్ బ్యాంక్ మరో అడుగు ముందుకేసిందని బ్యాంక్ ఎండీ బి.వేణుగోపాల్ రెడ్డి ప్రకటించారు. 'కల్యాణమస్తు' బ్రోచర్ ను ఆవిష్కరించిన ఆయన, పేద, మధ్యతరగతి వర్గాలకు దగ్గరయ్యేందుకు ఈ స్కీమ్ ను తెచ్చినట్టు తెలిపారు.
ఇందులో భాగంగా రూ. 5 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకూ రుణాన్ని పొందవచ్చని, దీన్ని ఆరు నుంచి 36 నెలల కాలవ్యవధిలో తీర్చాల్సి వుంటుందని అన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు 9100903904 ఫోన్ నంబర్ లో సంప్రదించాలని సూచించారు.