Uttam Kumar Reddy: మంచి మెజారిటీ వచ్చింది కాబట్టి, ఫిరాయింపులకు టీఆర్ఎస్ దూరంగా ఉంటుందని భావించా: ఉత్తమ్
- 9 నుంచి టీఆర్ఎస్ వైఖరిపై నిరసన
- ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మాత్రమే అందుబాటులో స్పీకర్
- గంటల వ్యవధిలోనే విలీనాన్ని పూర్తి చేస్తారా?
- నష్టం కాంగ్రెస్‌కు కాదు.. తెలంగాణ సమాజానికి
2018 ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ మంచి మెజారిటీని సాధించింది కాబట్టి ఫిరాయింపులకు దూరంగా ఉంటుందని తాను భావించానని కానీ అనైతికంగా, అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీన విషయమై ఉత్తమ్ స్పందించారు. గాంధీభవన్‌లో నేడు ఆయన భట్టి విక్రమార్క, వీహెచ్, షబ్బీర్ అలీ, పొన్నాలతో కలిసి మీడియాతో మాట్లాడారు. విలీన వ్యవహారంపై తాము హైకోర్టును ఆశ్రయించనున్నామని, అక్కడి తీర్పును బట్టి లోక్‌పాల్‌ను కూడా ఆశ్రయిస్తామన్నారు. కేసీఆర్ తన కోసం, తన కుటుంబం కోసం ప్రజాస్వామ్య వ్యవస్థలు నాశనమైనా ఫర్వాలేదన్నట్టు వ్యవహరిస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు.
ఈ నెల 9 నుంచి టీఆర్ఎస్ వైఖరిపై నిరసన కార్యక్రమాలు ఉద్ధృతం చేయనున్నట్టు ఉత్తమ్ తెలిపారు. సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మాత్రమే అందుబాటులో ఉంటున్నారని మండిపడ్డారు. రహస్య ప్రదేశంలో లేఖ తీసుకుని గంటల వ్యవధిలోనే సీఎల్పీ విలీనాన్ని పూర్తి చేస్తారా? అని ఉత్తమ్ నిలదీశారు. సీఎల్పీ విలీనంతో నష్టం కాంగ్రెస్‌కు కాదని, తెలంగాణ సమాజానికి జరిగిందని పేర్కొన్నారు. అవినీతి చేస్తున్నారు కాబట్టే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని సీఎం కేసీఆర్‌పై ఉత్తమ్ మండిపడ్డారు. హరీశ్‌రావుకు కేటీఆర్ అడ్డు రాకూడదని ఎమ్మెల్యేల కొనుగోలుకు కేసీఆర్ పాల్పడుతున్నారని ఉత్తమ్ ధ్వజమెత్తారు.