Ashish Tanvar: ఏఎన్-32 విమానం అదృశ్యమవడాన్ని కళ్లారా చూసిన ఆ విమాన పైలెట్ భార్య!
- ఏఎన్-32కి పైలెట్‌గా ఉన్న ఆశిష్
- ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ డ్యూటీలో ఉన్న సంధ్య
- సోమవారం మధ్యాహ్నం అదృశ్యమైన విమానం
- ఆశిష్ చిన్నాన్నకు సమాచారం అందించిన సంధ్య
భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం ఇటీవల అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి తాజాగా వెలుగు చూసిన విషయం విని అంతా షాక్ అవుతున్నారు. ఏఎన్-32 విమానం అదృశ్యమైన సమయంలో దానికి పైలట్‌గా ఆశిష్ తన్వార్ ఉన్నారు. ఆ విమానం అదృశ్యం కావడాన్ని ఆశిష్ భార్య సంధ్య తన్వార్ కళ్లారా చూశారు. విమానం అదృశ్యమైన రోజున సంధ్య ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ డ్యూటీలో ఉన్నారు.
అసోంలోని జోహ్రాట్ నుంచి సోమవారం మధ్యాహ్నం 12:25 గంటల సమయంలో సంధ్య భర్త నడుపుతున్న ఎన్-32 విమానం బయలుదేరింది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో అరుణాచల్ ప్రదేశ్‌లో మెంచుక బేస్ వైపు విమానం వెళుతుండగా రాడార్ నుంచి అది అదృశ్యమైంది. అదే సమయంలో డ్యూటీలో ఉన్న సంధ్య తన భర్త నడుపుతున్న విమానం అదృశ్యం కావడాన్ని కళ్లారా చూశారు. ఒక గంట సేపటి వరకూ వేచి చూసి విమానం ఆచూకీ తేలకపోవడంతో ఆమె ఆశిష్ చిన్నాన్న ఉదయ్ వీర్ సింగ్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
ఆశిష్, సంధ్యల వివాహం గతేడాది ఫిబ్రవరిలో జరిగింది. అప్పటి నుంచి ఈ జంట అసోంలోనే నివసిస్తోంది. విమానం తప్పిపోయినప్పటి నుంచి ఆశిష్ కుటుంబం ఆందోళనలో ఉంది. ఆశిష్ కుటుంబంలోని వారంతా సైనికులు, మాజీ సైనికులు కావడం విశేషం. మరోవైపు ఇప్పటికీ విమానం ఆచూకీ తెలియరాలేదు. విమానం గాలింపులో భారత నావికా దళం కూడా సహాయం అందిస్తోంది. విమానం కూలిపోయినట్టు భావిస్తున్న ప్రాంతంలో విమాన శకలాలేవీ కనిపించలేదని ఐఏఎఫ్ తెలిపింది.