Andhra Pradesh: ఏపీఎస్ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్.. యాజమాన్యంతో కార్మిక సంఘాల చర్చలు విఫలం!
- ఈ నెల 13 నుంచి సమ్మెలోకి 53 వేల మంది ఉద్యోగులు
- 70 లక్షల మంది ప్రయాణికులకు ఇబ్బంది
- ఆర్టీసీ యాజమాన్యం ముందు 26 డిమాండ్లు పెట్టిన కార్మిక సంఘాలు
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కార్మిక సంఘాలు ఈ రోజు యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో ఈ నెల 13 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి. తమ న్యాయసమ్మతమైన డిమాండ్లపై యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతోనే సమ్మెకు దిగుతున్నట్లు కార్మిక సంఘాలు తెలిపాయి. కార్మికుల వేతన సవరణ, బకాయిల చెల్లింపు, అద్దెబస్సుల పెంపు, సిబ్బంది కుదింపు చర్యల నిలుపుదల సహా 26 డిమాండ్ల పరిష్కారానికి ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించలేదని చెప్పాయి. ప్రస్తుతం రోజుకు 70 లక్షల మంది ప్రజలు ఆర్టీసీలో ప్రయాణిస్తున్నట్లు పేర్కొన్నాయి.
'ఈరోజు 3 గంటలకు పైగా ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు జరిపాం. ఈ సందర్భంగా సమ్మె తేదీ గడువు పెంచాలన్న అధికారుల ప్రతిపాదనను జేఏసీ తిరస్కరించింది. ఈ నెల 13 నుంచి 53,500 మంది ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు వెళతారు. ఈ నెల 9 నుంచి కార్మికులు కేవలం 8 గంటలు మాత్రమే పనిచేస్తారు. ఇకపై డబుల్ డ్యూటీలు చేయరు.
జూన్ 12న దూరప్రాంత సర్వీసులు ఆపేస్తాం. ప్రస్తుతమున్న అప్పులకు ఆర్టీసీ రోజుకు రూ.కోటి వడ్డీ కడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రూ.3,700 కోట్లు కేటాయించి ఆర్టీసీని ఆదుకోవాలి. ముఖ్యమంత్రి జగన్ ను త్వరలోనే కలిసి ఈ విషయాలను వివరిస్తాం. ప్రభుత్వం ఆర్టీసీని ఆదుకుంటుందని నమ్ముతున్నాం’ అని ఈయూ నాయకుడు దామోదర్ చెప్పారు.