Telangana: బీజేపీ తరపున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన వరలక్ష్మిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి
- నాగర్ కర్నూలు జిల్లాలో ఘటన
- ఇంటికొచ్చి ఇనుపరాడ్డుతో దాడిచేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు
- తీవ్ర గాయాల పాలైన వరలక్ష్మి
తెలంగాణలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన ఓ మహిళా అభ్యర్థిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని మహదేవునిపేటలో జరిగిందీ ఘటన. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గ్రామానికి చెందిన వరలక్ష్మి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచింది.
ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి తిరుపతి రెడ్డి 20 ఓట్ల ఆధిక్యంతో వరలక్ష్మిపై ఎంపీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. బుధవారం రాత్రి కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు వరలక్ష్మి ఇంటికి వచ్చి ఆమెతో ఘర్షణకు దిగారు. టీఆర్ఎస్ అభ్యర్థిపైనే పోటీ చేస్తావా? అంటూ వాదులాటకు దిగి ఇనుప రాడ్డుతో వరలక్ష్మి తలపై దాడిచేశారు. తీవ్రగాయాలపాలైన ఆమెను వెంటనే నాగర్‌కర్నూలు ఆసుపత్రికి తరలించినట్టు ఆమె భర్త నారాయణాచారి తెలిపారు.