Ravi prakash: రవిప్రకాశ్‌ను 11 గంటలపాటు విచారించిన పోలీసులు.. పొంతనలేని సమాధానాలు.. నేడు కూడా విచారణ!
- ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన సైబర్ క్రైం పోలీసులు
- దాటవేత ధోరణి కనబర్చిన రవిప్రకాశ్
- అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లారన్న ప్రశ్నకు సమాధానం నిల్
ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను బుధవారం రెండో రోజు కూడా పోలీసులు విచారించారు. ఉదయం 11:30 నుంచి రాత్రి 10:45 గంటల వరకు దాదాపు 11 గంటలపాటు పోలీసులు ఆయనను విచారించారు. అయితే, పోలీసుల ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో నేడు మరోమారు ఆయనను విచారించాలని సైబర్ క్రైం పోలీసులు నిర్ణయించారు.
అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పకుండా దాటవేసే ధోరణి కనబర్చారని ఏసీపీ శ్రీనివాస కుమార్ తెలిపారు. టీవీ-9 కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాల్ సంతకం ఎందుకు ఫోర్జరీ చేశారు? 40వేల షేర్లను నటుడు శివాజీకి అమ్మినట్లు అగ్రిమెంట్ ఎలా సృష్టించారు? విచారణకు హాజరుకాకుండా అజ్ఞాతంలో ఎందుకు ఉన్నారు? అన్న ప్రశ్నలకు రవిప్రకాశ్ పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. పరస్పర విరుద్ధ సమాధానాలు ఇస్తూ పోలీసులను గందరగోళానికి గురిచేసినట్టు సమాచారం. దీంతో రాత్రి ఇంటికి పంపేసిన పోలీసులు నేడు మరోమారు విచారణకు హాజరు కావాల్సిందిగా రవిప్రకాశ్‌ను ఆదేశించారు.