Team India: భారత్ ఆరంభం అదిరింది.. సెంచరీతో భారత్‌ను గెలిపించిన రోహిత్ శర్మ
- ప్రపంచకప్‌లో భారత్ బోణీ
- ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం
- అజేయ సెంచరీతో జట్టును గెలిపించిన ‘రోహిత్‌కే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’
- మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై కివీస్ గెలుపు
ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం చేసింది. సౌతాంప్టన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ మరో 15 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు తొలుత భారత బౌలర్లు షాకిచ్చారు. యుజ్వేంద్ర చాహల్ 4 వికెట్లు తీసుకుని సఫారీల వెన్ను విరిచాడు. భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రాలు రెండేసి వికెట్లతో ఆ తర్వాత పని కానిచ్చి సఫారీలను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లలో క్రిస్ మోరిస్ చేసిన 42 పరుగులే అత్యధికం.
అనంతరం 228 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 13 పరుగుల వద్ద శిఖర్ ధవన్ (8) అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ (18) నిరాశపరిచినప్పటికీ రోహిత్ శర్మ మాత్రం క్రీజులో పాతుకుపోయి దక్షిణాఫ్రికా బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. అజేయంగా 122 పరుగులు చేసి ఈ ప్రపంచకప్‌లో భారత్ తరపున తొలి సెంచరీ సాధించాడు. లోకేశ్ రాహుల్ 26, ధోనీ 34 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్యా 15 పరుగులు చేసి మ్యాచ్‌కు ఘనమైన ముగింపు ఇచ్చాడు. సెంచరీతో భారత్‌కు విజయాన్ని అందించిన రోహిత్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ మ్యాచ్’ అవార్డు దక్కింది.
బంగ్లాదేశ్-న్యూజిలాండ్ మధ్య కెన్నింగ్టన్ ఓవల్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో న్యూజిలాండ్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ 47.1 ఓవర్‌లో 8 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. 82 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించిన రాస్ టేలర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.