Galla Jaydev: ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిసిందని భావిస్తున్నా: గల్లా జయదేవ్

  • పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు
  • పార్లమెంటరీ నేతగా నానిని ప్రకటించినా అభ్యంతరంలేదని చెప్పా
  • గల్లా కుటుంబానికి రెండు పదవులు అనే కోణంలో చూడొద్దు

తెలుగుదేశం పార్టీలో ఇవాళ కేశినేని నాని వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన పార్టీ మారుతున్నాడంటూ ప్రచారం జరగడంతో టీడీపీ అధినేత చంద్రబాబు వెంటనే అప్రమత్తం కావడం, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ స్వయంగా రాయబారం నెరపి, నానిని చంద్రబాబు నివాసానికి తీసుకురావడం జరిగాయి. ఆ తర్వాత, చంద్రబాబు ఇద్దరు ఎంపీలతో ఒకసారి, వేర్వేరుగా మరోసారి సమావేశమై పరిస్థితిని ఓ కొలిక్కి తీసుకువచ్చారు.

చంద్రబాబుతో భేటీ ముగిశాక గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడుతూ, టీడీపీలో విభేదాలు లేవని, ఎంపీల మధ్య ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. 'పార్లమెంటరీ పార్టీ నేతగా ఎప్పుడూ నేనే ఉండాలని కోరుకోవడంలేదు, కేశినేని నానికి ఆ పదవి ఇచ్చినా అభ్యంతరంలేదని చంద్రబాబుతో చెప్పాను' అంటూ గల్లా వివరణ ఇచ్చారు. తన తల్లి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుని పొలిట్ బ్యూరోలో కొనసాగుతున్నారని, దయచేసి గల్లా కుటుంబానికి రెండు పదవులు అనే కోణంలో మాత్రం చూడొద్దని జయదేవ్ విజ్ఞప్తి చేశారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిసిందని భావిస్తున్నామని, పార్టీపరంగా ఎలాంటి సమస్యాలేదని ఆయన స్పష్టం చేశారు.

Galla Jaydev
Telugudesam
Chandrababu
Kesineni Nani
  • Loading...

More Telugu News