Kerala: కేరళలో మళ్లీ పడగవిప్పిన నిఫా వైరస్!
- ఆసుపత్రిలో చేరిన ఐదుగురు
- ఒకరికి పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ
- ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నామన్న ప్రభుత్వం
కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం చెలరేగింది. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఓ యువకుడిని నిఫా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కె.కె.శైలజ తెలిపారు. ఇప్పటివరకూ ఐదుగురు వ్యక్తుల్లో నిఫా లక్షణాలు కనిపించాయనీ, వీరందరినీ ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందజేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు భయపడవద్దని, పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు.
1988లో తొలిసారి నిఫా వైరస్ ను మలేసియాలో గుర్తించారు. అక్కడి నుంచి కేరళకు ఎలాగో పాకింది. ఇది గబ్బిలాల నుంచి వ్యాపిస్తుంది. గబ్బిలాలు తింటుండగా కింద రాలిపడిపోయే పండ్లను తినే జంతువులతో ఇది మనుషులకు సోకుతుంది. నిఫా సోకిన వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఈ వైరస్ వ్యాపించగలదు. ఈ వ్యాధిని ప్రారంభదశలోనే గుర్తిస్తే చికిత్స ద్వారా వైరస్ ను అదుపు చేయొచ్చు.