Ravi Prakash: నేడు కూడా సీసీఎస్ విచారణకు వచ్చిన టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్
- ఫోర్జరీ, మోసం అభియోగాలను ఎదుర్కొంటున్న రవిప్రకాశ్
- నెల రోజుల అజ్ఞాతం తరువాత నిన్న పోలీసుల ముందుకు
- నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే యోచనలో పోలీసులు
సంతకాల ఫోర్జరీ, మోసం వంటి అభియోగాలను ఎదుర్కొంటూ, దాదాపు నెల రోజులకు పైగా అజ్ఞాతంలో గడిపిన టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్, నేడు వరుసగా రెండో రోజూ సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. నిన్న ఆయన్ను 5 గంటల పాటు ఉన్నతాధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఈ విచారణలో ఆయన పెద్దగా ఉపయోగపడే సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో ఆయన్ను నేడు కూడా విచారణకు రావాలని ఆదేశించగా, ఉదయం 11 గంటల ప్రాంతంలో సీసీఎస్ కార్యాలయానికి రవిప్రకాశ్ వచ్చారు. నేడు ఆయన్ను పలు అంశాలపై ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. రవిప్రకాశ్ ను అరెస్ట్ చేయాలంటే కనీసం 48 గంటల ముందు నోటీసులు ఇవ్వాలని రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు షరతు విధించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో, ముందుగా నోటీసులు ఇచ్చి, ఆయనను అరెస్ట్ చేయాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం.