Dog: కుక్కను దత్తత తీసుకుని వదిలేశారంటూ యువకుడి కేసు!
- లాసా ఆప్సో జాతికి చెందిన కుక్కపిల్లను దత్తత ఇచ్చిన యువకుడు
- కుక్కపిల్ల కోసం వారం రోజులుగా వెతుకులాట
- దత్తత తీసుకున్న వారిపై యువకుడి ఫిర్యాదు
తన వద్ద దత్తత తీసుకున్న శునకాన్ని వీధిలో వదిలేశారంటూ ఓ యువకుడు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల కథనం ప్రకారం.. తిరుపతికి చెందిన జేసీ తరుణ్‌తేజ ఉప్పల్‌లో ఉంటున్నాడు. తాను పెంచుకునే లాసా ఆప్సో జాతికి చెందిన కుక్కపిల్ల మోజితొను గత నెల 19న బోరబండలో ఉండే హరి-అక్షయ్‌లకు దత్తత ఇచ్చాడు. మోజితొను దత్తత తీసుకున్న హరి-అక్షయ్‌లు రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి పప్పీ ఏమీ తినడం లేదని చెప్పారు. ఆ తర్వాత మరో రెండు రోజులకు ఫోన్ చేసి తమను కరుస్తోందని ఫిర్యాదు చేశారు.
దీంతో కుక్కపిల్లను చూసేందుకు తాను వస్తున్నానని తరుణ్ తేజ వారికి చెప్పాడు. అయితే, అప్పుడే వద్దంటూ వాయిదా వేస్తూ రావడంతో అనుమానం వచ్చిన తరుణ్‌తేజ తన పప్పీకి ఏమైందంటూ వారిని ప్రశ్నించాడు. దీంతో వారు అసలు విషయం చెప్పేశారు. దానిని పెంచడం తమ వల్ల కాదని, ఏమీ తినడం లేదని, కరుస్తోందని చెప్పుకొచ్చారు. అందుకనే దానిని కావూరీ హిల్స్ ప్రాంతంలో వదిలేశామని చెప్పడంతో తరుణ్ విస్తుపోయాడు.
వెంటనే కావూరీ హిల్స్ ప్రాంతానికి చేరుకుని అందరూ కలిసి మొజితొ కోసం వెతుకులాట ప్రారంభించారు. వారం రోజులుగా మాదాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఫలితం లేకపోవడంతో తరుణ్ తేజ సోమవారం రాత్రి జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దత్తత తీసుకుని తన మొజితొను వదిలేసిన హరి-అక్షయ్‌లపై చర్యలు తీసుకోవాలని కోరాడు.