Sania Mirza: ఎప్పుడెలా ఆడతారో ఊహించలేం: పాకిస్థాన్ విజయంపై సానియా మీర్జా స్పందన

  • పాక్ జట్టుకు కంగ్రాట్స్ 
  • ఓటమి నుంచి పుంజుకోవడం అద్భుతం
  • ట్వీట్ చేసిన టెన్నిస్ క్వీన్

అస్థిరమైన ఆటతీరుకు మారుపేరుగా నిలిచే పాకిస్థాన్ తన ట్యాగ్ లైన్ కు ఈ వరల్డ్ కప్ లో కూడా న్యాయం చేసింది. తొలి మ్యాచ్ లో వెస్టిండీస్ పై దారుణమైన రీతిలో 105 పరుగులకే ఆలౌటై ఓటమి చవిచూసిన పాక్, ఆ తర్వాత మ్యాచ్ లో ఏకంగా 348 పరుగులు బాది ఆతిథ్య ఇంగ్లాండ్ కే షాకిచ్చింది. దీనిపై పాకిస్థాన్ కోడలు, భారత టెన్నిస్ తార సానియా మీర్జా స్పందించారు.

"పాకిస్థాన్ జట్టుకు శుభాభినందనలు. ఓ మ్యాచ్ లో ఓటమిపాలైనా పుంజుకుని గెలుపు బాట పట్టడం అద్భుతం. పాకిస్థాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో ఊహించలేమని అందరూ ఎందుకు అంటారో మరోసారి నిరూపితమైంది. క్రికెట్ ప్రపంచకప్ మరింత ఆసక్తికరంగా మారిందనడంలో ఎలాంటి సందేహంలేదు" అంటూ ట్వీట్ చేశారు.

కాగా, వెస్టిండీస్ చేతిలో ఘోరపరాజయం చెందడంతో పాకిస్థాన్ జట్టును అభిమానులు భయంకరంగా తిట్టిపోశారు. ఓవైపు మాజీలు, మరోవైపు కరుడుగట్టిన అభిమానులు పాక్ జట్టును ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టును ఓడించి పరువు నిలుపుకుంది పాకిస్థాన్ జట్టు. దాంతో ఎప్పట్లాగానే పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు శభాష్ అంటూ మెచ్చుకోళ్లతో హోరెత్తిస్తుండగా, టైటిల్ విజేత పాకిస్థానే అంటూ అభిమానులు ఊదరగొడుతున్నారు.

Sania Mirza
Pakistan
Cricket
  • Error fetching data: Network response was not ok

More Telugu News