KTR: బ్యాలెట్ అయినా సరే, ఈవీఎం అయినా సరే... ఇది చారిత్రక, అసాధారణ విజయం: కేటీఆర్
- పరిషత్ ఎన్నికలపై కేటీఆర్ స్పందన
- ఫలితాలు చూసి టీఆర్ఎస్ బాస్ లో ఆనందోత్సాహాలు
- ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల్లో టీఆర్ఎస్ దూకుడు
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పొంగిపోతున్నారు. ఫలితాల్లో ఇప్పటివరకు 3,556 ఎంపీటీసీ స్థానాలు, 24 జడ్పీ స్థానాలు కైవసం చేసుకుని టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుండడంపై కేటీఆర్ స్పందించారు. ఇది చారిత్రక, అసాధారణ విజయం అని అభివర్ణించారు.
పార్టీ ఆవిర్భవించిన 2001లోనే టీఆర్ఎస్ పరిషత్ ఎన్నికలు ఎదుర్కొందని, అప్పుడు కరీంనగర్, నిజామాబాద్ జడ్పీ పీఠాలు చేజిక్కించుకుని సత్తా చాటిందని వివరించారు. అప్పటినుంచి ఇది ఐదో స్థానిక ఎన్నికల క్రతువు అని, అయితే ఈసారి మాత్రం టీఆర్ఎస్ ఎన్నడూలేనంతగా ఘనవిజయం సాధించిందని చెప్పారు. నూటికి నూరు శాతం జిల్లాలు కైవసం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదని, తమపై ఈస్థాయిలో ఆదరాభిమానాలు చూపించిన ప్రజలకు రుణపడి ఉంటామని కేటీఆర్ తెలిపారు.
ఈ ఎన్నికల్లో తీవ్రంగా శ్రమించిన గులాబీ సైనికులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. ఎన్నిక ఏదైనా సరే, అది బ్యాలెట్ ద్వారా అయినా సరే ఈవీఎం ద్వారా అయినా సరే కేసీఆరే మా నాయకుడు అంటూ మిగతా పార్టీలను ప్రజలు తిప్పికొట్టారు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.