Cricket: ఆఫ్ఘనిస్థాన్ బౌలింగ్ దూకుడు: 15 పరుగుల తేడాతో 5 వికెట్లు చేజార్చుకున్న శ్రీలంక
- నబీ మ్యాజిక్
- ఒకే ఓవర్లో మూడు వికెట్లు
- శ్రీలంక విలవిల
శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ జట్లలో ఒకటి అపార అనుభవం ఉన్న జట్టు కాగా, మరొకటి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న జట్టు. అయితే ఆఫ్ఘనిస్థాన్ ను తక్కువగా అంచనా వేస్తే ఏం జరుగుతుందో కొన్ని పెద్ద జట్లకు ఈపాటికే అర్థమైంది. తాజాగా, ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ లో ఇవాళ శ్రీలంక కూడా ఆఫ్ఘన్ బౌలింగ్ ను తక్కువ అంచనా వేసి మూల్యం చెల్లించుకుంది.
కార్డిఫ్ లో శ్రీలంక జట్టు ఓ దశలో 144 /1 తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ దశలో ఆఫ్ స్పిన్నర్ నబీ బంతితో మాయాజాలం చేసి ఏకంగా ఒకే ఓవర్లో 3 వికెట్లు పడగొట్టి లంకను కోలుకోలేని దెబ్బతీశాడు. ఆ తర్వాత హమీద్ మరో వికెట్ తీశాడు. ఈ తరుణంలో సీనియర్ బ్యాట్స్ మన్ తిసర పెరెరా రనౌట్ కావడంతో 159 పరుగులకే శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓవైపు ఒంటరిపోరాటం చేసిన కుశాల్ పెరెరా 78 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. ప్రస్తుతం శ్రీలంక జట్టు 32.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది.