Telangana: అసెంబ్లీలో కాంగ్రెస్ కథ ముగించే వ్యూహానికి గులాబీ దళం పదును!
- సీఎల్పీ విలీనంపై టీఆర్ఎస్ ఉత్సాహం
- మరొక్క ఎమ్మెల్యే మద్దతిస్తే విలీనం లాంఛనమే!
- ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరేందుకు 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిర్ణయం!
కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని తమలో విలీనం చేసుకునేందుకు అధికార టీఆర్ఎస్ ఉరకలు వేస్తోంది. నల్గొండ ఎంపీగా ఎన్నికైన ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి త్వరలోనే రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో, ఉత్తమ్ రాజీనామా చేయగానే సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేసేందుకు గులాబీదళం హైకమాండ్ పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 19 మంది కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. వారిలో ఇప్పటికే 11 మంది టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు.
ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనుండడంతో టీఆర్ఎస్ అధిష్ఠానం విలీనంపై దృష్టిసారించింది. మరొక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లోకి వస్తే సీఎల్పీ విలీనం లాంఛనప్రాయమేనని గులాబీదళం భావిస్తోంది. ఇదే జరిగితే తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ ఉనికి గల్లంతయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగియగానే అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే కాంగ్రెస్ భవితవ్యం తేలిపోనుంది.