Mamata Benerjee: అందుకే ఆమె ఫైర్ బ్రాండ్... బీజేపీ కార్యాలయం తలుపులు పగులగొట్టి, టీఎంసీ గుర్తును పెయింట్ చేసి వచ్చిన మమతా బెనర్జీ!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-340b7ea56310cec4e214bbf0f74c8a17c9cebc12.jpg)
- మే 30న నార్త్ పరగణాల జిల్లాలో ఘటన
- స్వయంగా గుర్తును పెయింట్ చేసిన మమత
- మోదీ ప్రమాణ స్వీకార సమయంలో ఘటన
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని అందరూ ఫైర్ బ్రాండ్ అని ఎందుకు పిలుస్తారో ఈ ఘటనను చూస్తే తెలిసిపోతుంది. నార్త్ 24 పరగణాల జిల్లా పరిధిలోని నైహతిలో ఉన్న బీజేపీ కార్యాలయంలోకి వెళ్లి, తలుపులు పగులగొట్టించిన ఆమె, కాషాయపు రంగేసున్న గోడలపై తృణమూల్ కాంగ్రెస్ పేరు, గుర్తును పెయింట్ చేశారు. ఆమే స్వయంగా తృణమూల్ సింబల్ (మూడాకుల మొక్క, గడ్డి)ను గోడపై పెయింట్ చేశారు. ఈ ఘటన గత నెల 30న జరిగినట్టుగా తెలుస్తోంది.
అది తమ పార్టీ కార్యాలయమేనని, ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ అనుచరులు బలవంతంగా లాక్కున్నారని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. మమత చేసిన పని రెండు రోజులు ఆలస్యంగా బయటకు వచ్చింది. మమతా బెనర్జీ చేసిన పనిపై బీజేపీ మండిపడుతోంది. ఆ పార్టీ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తారనడానికి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదని పార్టీ నాయకులు విమర్శలు గుప్పించారు.