ahmadabad: మహిళపై బీజేపీ శాసన సభ్యుడి దౌర్జన్యం... కాలితో తన్నిన వైనం
- గుజరాత్ రాష్ట్రం నరోడా నియోజకవర్గంలో ఘటన
- కుళాయి కనెక్షన్ల కోసం ఆందోళన చేస్తుండగా అసహనం
- విమర్శలు రావడంతో క్షమాపణ చెప్పేందుకు సిద్ధపడిన ఎమ్మెల్యే
ప్రజాప్రతినిధులు బహిరంగ ప్రదేశాల్లో ఎంత ఆదర్శంగా ఉంటే ప్రజలకు అంత మంచి సందేశం ఇచ్చిన వారవుతారు. పైగా హక్కులు కాపాడుకోవడం కోసం ప్రజలు నిరసన తెలియజేయడం పరిపాటి. ఇటువంటి సందర్భాల్లో ఎంతో సహనంతో వ్యవహరించాల్సిన ఓ ప్రజా ప్రతినిధి వ్యవస్థకు తలవంపులు తెచ్చాడు. గుజరాత్ లోని నరోడా నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే బలరాం థవానీ తప్పుగా వ్యవహరించి విమర్శల పాలయ్యారు.
వివరాల్లోకి వెళితే...కుళాయి కనెక్షన్లు పునరుద్ధరించాలంటూ ఎమ్మెల్యే బలరాం థవానీ ఇంటి ముందు కొందరు మహిళలు నిరసన తెలియజేస్తున్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నంలో నీతూ తేజ్వానీ అనే మహిళను కాలితో తన్నారు. ఈ ఘటనను కొందరు వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో ఎమ్మెల్యే ఇరుకున పడ్డారు. నీతూ తేజ్వానీ భర్త తొలుత తనపై దాడిచేశాడని, దాన్ని అడ్డుకునే క్రమంలోనే తాను ఎదురు తిరగాల్సి వచ్చిందని బలరాం వివరణ ఇచ్చారు. అవసరం అనుకుంటే బాధితురాలికి తాను క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. అయితే ఎమ్మెల్యేపై నీతూ తేజ్వానీ భర్త దాడి చేయలేదని, ఎమ్మెల్యే అనుచరులే తొలుత దాడి చేశారని బాధితురాలి తరఫువారు చెబుతున్నారు.