two floor building: రెండంతస్తుల భవనానికి కాళ్లు వచ్చాయి... అధునాతన పరిజ్ఞానంతో వెనక్కి మళ్లింపు!
- రోడ్డు విస్తరణలో అడ్డుగా ఉండడంతో వెనక్కి తరలింపు
- పక్షం రోజులుగా జరుగుతున్న పనులు
- ఇప్పటికే భవనాన్ని జాకీలపై నిలబెట్టిన కార్మికులు
అదో రెండంతస్తుల భవనం. ప్రధాన రహదారిని ఆనుకుని ఉండడంతో ఇన్నాళ్లు దానికో ప్రత్యేక ఆకర్షణ ఉండేది. ఈ భవనాన్ని వెనక్కి జరిపించే ప్రయత్నం ప్రారంభించి మరో ఆకర్షణకు తెరలేపారు దాని యజమాని. వివరాల్లోకి వెళితే...తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో ప్రధాని రహదారిని ఆనుకుని ఓ రెండంతస్తుల భవనం ఉంది. ప్రస్తుతం ఈ రోడ్డును విస్తరిస్తుండడంతో ఈ భవనం కోల్పోయే పరిస్థితి వచ్చింది. దీంతో యజమాని పోతుల రాంకుమార్ భవనం వెనుక తనకు ఖాళీ స్థలం ఉండడంతో అందుబాటులోకి వచ్చిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి భవనాన్ని వెనక్కి నడిపే ప్రయత్నం ప్రారంభించారు.
బీహార్ రాష్ట్రానికి చెందిన కొందరు కూలీలు ఇప్పటికే ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పునాదులు కట్ చేసి భవనాన్ని జాకీలపై నిలబెట్టారు. భవనాన్ని చేర్చే స్థలం వద్ద పిల్లర్లు నిర్మించి దానిపై భవనాన్ని నిలబెట్టనున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఇటువంటి పనులు జరుగుతుండడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగూడి వీటిని తికిస్తున్నారు. మరో నెలరోజుల్లో భవనం వెనక నిర్ణయించిన ప్రాంతంలో నిలబెట్టనున్నట్ల యజమాని రాంకుమార్ చెబుతున్నారు.