Raghu: ముక్క తినని మొగుడు తనకొద్దంటూ కేసు పెట్టిన యువతి... తలపట్టుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు!

  • ఆరు నెలల క్రితం రఘు, రమ్యలకు వివాహం
  • పూర్తి శాకాహార కుటుంబం నుంచి వచ్చిన రఘు
  • మాంసం తినకుంటే రఘు వద్దని తెగేసి చెబుతున్న రమ్య
  • రెండు సార్లు కౌన్సెలింగ్ ఇచ్చినా మారని వైనం 

రఘు, రమ్య... ఇద్దరూ మంచి జీతం తీసుకుంటున్న టెక్కీలే. ఆరు నెలల క్రితం వీరిద్దరికీ వివాహమైంది. రఘు కుటుంబమేమో పూర్తి శాకాహార కుటుంబం. ఇంట్లో మాంసానికి చోటే ఉండదు. కానీ, రమ్య నేపథ్యం అది కాదు. వాళ్లింట్లో చికెన్, మటన్ లేనిదే ముద్ద దిగదు. అటువంటి భిన్న ధ్రువాలైన వ్యక్తులు పట్టుమని ఆరు నెలలైనా కాపురం చేయలేదు. ముక్క తినని మొగుడు తనకు వద్దంటూ రమ్య హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ లో కేసు పెట్టడంతో, దీన్నెలా పరిష్కరించాలో తెలియక పోలీసులు తల పట్టుకున్న పరిస్థితి.

గత వారం పోలీసుల వద్దకు వచ్చిన రమ్య, తన భర్త మాంసాహారం తినడం లేదని, అటువంటి భర్త తనకు వద్దని చెప్పింది. అతను తన అలవాటును మార్చుకుంటాడని తాను ఆరు నెలల పాటు ఎదురు చూశానని చెప్పింది. పెళ్లికి ముందు అతను శాకాహారన్న విషయం తనకు తెలియదని వాపోయింది. దీంతో కేసును ఎలాగైనా పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఇరు కుటుంబాల వారినీ పిలిపించిన పోలీసులు, వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా, రఘు, రమ్యలు తమ పట్టు వీడలేదు. రమ్యకు మహిళా విభాగం చేత ప్రత్యేక కౌన్సెలింగ్ ఇప్పించినా ఆమె మారలేదు.

మాంసం కోసం భర్తను వద్దనుకుంటున్న తొలి హైదరాబాద్ మహిళ రమ్యే కావచ్చని జూబ్లీహిల్స్ పోలీసులు వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ కేసులో మరోసారి ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇస్తామని, ఎవరూ తగ్గకుంటే, ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News