Kerala: 38 ఏళ్లుగా మదర్సా విద్యార్థులపై అత్యాచారం.. చిన్నప్పుడు తనపై జరిగిన రేప్‌కు ప్రతీకారం.. 63 ఏళ్ల ఉపాధ్యాయుడి అరెస్ట్!

  • నిందితుడు కూడా బాధితుడే
  • తనపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి కుమార్తెపై అత్యాచారంతో మొదలు
  • విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడించిన నిందితుడు

మదర్సాలోని విద్యార్థులను 38 ఏళ్లుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్న 63 ఏళ్ల ఉపాధ్యాయుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలోని అలువాకు చెందిన యూసుఫ్ గత రెండేళ్లుగా థలయోలపరంబు మదర్సాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మదర్సా కార్యకలాపాలను నిర్వహిస్తున్న మసీదు కమిటీ ఫిర్యాదు మేరకు కొడుంగల్లూర్ పోలీసులు యూసుఫ్‌ను అరెస్ట్ చేశారు.

ఖురాన్ నేర్పిస్తానంటూ వారం రోజుల క్రితం ఓ బాలుడిని యూసుఫ్ తన గదికి పిలిపించాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన బాలుడు భయంతో వణికిపోతుండడాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వారు మసీదు కమిటీకి ఫిర్యాదు చేయగా, వారు యూసుఫ్‌ను సస్పెండ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు విస్తుపోయే నిజాలు వెల్లడించాడు. తాను 25 ఏళ్ల వయసు నుంచే చిన్నారులపై అత్యాచారాలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు.

చిన్నప్పుడు తాను అత్యాచారానికి గురయ్యానని,  ఆ తర్వాత తనపై అత్యాచారం చేసిన వ్యక్తి కుమార్తెపై తాను అత్యాచారం చేసి పగ తీర్చుకున్నట్టు చెప్పాడు. తనపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో అత్యాచారాలు చేయడాన్ని కొనసాగిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు 12 మందికిపైగా చిన్నారులపై యూసుఫ్ అత్యాచారాలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News