Madhya Pradesh: తుపాకి లైసెన్స్ కావాలంటే మొక్కను నాటి సెల్ఫీ తీసిపంపాలి: కొత్త రూల్ పెట్టిన గ్వాలియర్ కలెక్టర్
- గ్వాలియర్ కలెక్టర్ ‘గ్రీన్’ ఆదేశాలు
- దరఖాస్తుదారులు కనీసం పది మొక్కలు నాటాల్సిందే
- గ్రామస్థాయి అధికారులు పర్యవేక్షించాకే లైసెన్స్ జారీ
తుపాకి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ కలెక్టర్ ‘గ్రీన్’ నిబంధన విధించారు. గన్ లైసెన్స్ కావాలనుకునే వారు అంతకంటే నెల రోజుల ముందు కనీసం పది మొక్కలు నాటాలని, అనంతరం వాటితో సెల్ఫీ తీసుకుని దరఖాస్తుకు జత చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
సొంత స్థలం లేనివారు ఆ విషయాన్ని అధికారులకు చెబితే రెవెన్యూ స్థలాన్ని చూపిస్తారని కలెక్టర్ అనురాగ్ చౌదరి పేర్కొన్నారు. అయితే, ప్రాణహాని ఉందంటూ అత్యవసరంగా లైసెన్స్ కోరే వారికి మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఉన్నట్టు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.
గన్ లైసెన్స్ కోరేవారు మొక్కలు నాటి వదిలేస్తే సరిపోదని, వాటి సంరక్షణ బాధ్యతలు కూడా చూడాలని కలెక్టర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దరఖాస్తు అందాక, దరఖాస్తుదారు నాటినట్టుగా పేర్కొన్న మొక్కలను స్థానిక అధికారులు పరిశీలించి కలెక్టర్‌కు నివేదిక అందిస్తారు. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా లైసెన్స్ జారీ చేస్తారు.