Nizamabad District: ‘కంట్రీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లోకి నిజామాబాద్ లోక్ సభ ఎన్నిక!
- దేశం దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ ఎంపీ ఎన్నిక
- టీఆర్ఎస్ అభ్యర్థి కవితపై 184 మంది పోటీ
- 2 వేల మంది సిబ్బంది, 600 మంది ఇంజనీర్ల పాత్ర
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశం దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ ఎంపీ స్థానం ఇప్పుడు రికార్డులకెక్కింది. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై ఏకంగా 184 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. వీరిలో అత్యధికమంది నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని పసుపు, ఎర్రజొన్న రైతులే. ఈ ఎన్నికల్లో కవిత అనూహ్యంగా ఓటమి పాలయ్యారు.
మొత్తం 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ స్థానంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పెద్ద కసరత్తే చేసింది. అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఉండడంతో 12 బ్యాలెట్ యూనిట్లతో 1788 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. నిజామాబాద్ ఎన్నిక ఏర్పాట్ల కోసం 2 వేల మంది ఎన్నికల సిబ్బంది, 600 మంది ఇంజనీర్లు ఐదు రోజులపాటు కష్టపడ్డారు.
2 వేల కంట్రోల్ యూనిట్లు, 2 వేల వీవీప్యాట్లు, 15 హాళ్లు, 149 టేబుళ్లు ఉపయోగించారు. ఈ స్థాయిలో ఎన్నిక నిర్వహించడం చరిత్రలోనే ఇదే తొలిసారని ‘కంట్రీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ పేర్కొంది. ఈ మేరకు నిజామాబాద్‌లో గెలిచిన ఎంపీ ధర్మపురి అరవింద్ కు, భారత ఎన్నికల సంఘానికి లేఖలు పంపింది.
అలాగే, ఈ ఎన్నికను సమర్థంగా నిర్వహించిన తెలంగాణ ఎన్నికల అధికారి రజత్ కుమార్ పేరును కూడా రికార్డులో చేర్చింది. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా త్వరలోనే ఈ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అందించాలని యోచిస్తోంది.