Telangana: తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు
- తెలంగాణలో విచిత్ర వాతావరణం
- కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
- మరికొన్ని జిల్లాల్లో కొనసాగిన భానుడి ప్రతాపం
తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న సాయంత్రం కొన్ని జిల్లాలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈదురు గాలులకు చాలా ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. చెట్టు కూలి పడడంతో ఓ ఎద్దు మృతి చెందింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పిడుగు పాటుకు ముగ్గురు మృతి చెందారు.
కొన్ని జిల్లాల్లో ఆదివారం వాతావరణం అలా ఉంటే, మరికొన్ని జిల్లాల్లో మాత్రం భానుడి ప్రతాపం కొనసాగింది. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 45.3 డిగ్రీలు, భద్రాచలంలో 42.8, హైదరాబాద్‌లో 42.7, ఖమ్మంలో 44.2, మహబూబ్‌నగర్‌లో 43, మెదక్‌లో 40.2, నల్లగొండలో 43.6, నిజామాబాద్ లో 45, రామగుండంలో 43.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.