FDC chairman: సినీనటి జయసుధకు కీలక పదవి...అంబికాకృష్ణ స్థానం ఆమెదేనా?
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-8869031370cc896f15fe0a7e68335faf536fbbbe.jpg)
- ఖాళీ అయిన ఎఫ్‌డీసీ చైర్మన్ పదవి
- ఈ పదవి కోసం ఆమె పేరు పరిశీలిస్తున్నారని టాక్
- రేస్ లో ఉన్న మరికొందరు నటీనటులు
రాష్ట్రంలో ప్రభుత్వం మారితే నామినేటెడ్ పదవుల పందారం మొదలు కావడం సహజం. ప్రస్తుతం నవ్యాంధ్రలో ఇదే టాక్ నడుస్తోంది. రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ (ఎఫ్ డీసీ) చైర్మన్ పదవికి సీనియర్ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ పేరు పరిశీలనలో ఉందని సమాచారం. టీడీపీ హయాంలో ఈ పదవిలో నియమితుడైన అంబికాకృష్ణ ఇటీవల చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది.
ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ తరపున పృధ్వీరాజ్, అలీ, పోసాని, మోహన్‌బాబు, జయసుధ, జీవిత, రాజశేఖర్ తదితర ప్రముఖలు ప్రచారం నిర్వహించారు. పార్టీ అధికారంలోకి రావడంతో తమకు ఏదైనా కీలక పదవి దక్కుతుందన్న ఆశతో వీరంతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన ఎఫ్‌డీసీ చైర్మన్ గిరీ ఎవరికి దక్కుతుందా? అన్న టాక్ నడుస్తోంది.
ఇందుకోసం జయసుధ పేరును జగన్ పరిశీలిస్తున్నారని సమాచారం. సీనియర్ నటి కావడంతోపాటు పరిశ్రమలో అందరితో సత్సంబంధాలు ఉండడం ఆమెకు కలిసి వచ్చే అంశమని భావిస్తున్నారు.