Tirumala: తిరుమలలో భారీ రద్దీ... రోడ్డుపైనే వేచిచూస్తున్న భక్తులు!

  • నిండిపోయిన కంపార్టుమెంట్లు
  • సర్వదర్శనానికి 24 గంటల సమయం
  • రేపు తిరుమల రానున్న వెంకయ్యనాయుడు

తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామి దర్శనానికి వేచి చూస్తున్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి, క్యూలైన్ బయటకు సాగింది. కంపార్టుమెంట్లలోకి ప్రవేశించేందుకు భక్తులు రోడ్డుపైనే వేచి చూస్తున్న పరిస్థితి. ఈ ఉదయం సర్వదర్శనానికి వెళితే, రేపు మాత్రమే స్వామిని చూసుకునే పరిస్థితి. సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి, టైమ్ స్లాట్ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. సాధారణ భక్తులకు సమస్యలు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, అన్న ప్రసాదాలు, పాలు, మజ్జిగ అందిస్తున్నామని అధికారులు తెలిపారు.

వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకోవడంతోనే రద్దీ అధికంగా ఉందని వెల్లడించారు. ప్రసాదం కౌంటర్ల వద్ద రద్దీ అధికంగా ఉండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, రేపు ఉదయం ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు తిరుమలకు రానున్నారు. రేపు ఉదయం తిరుపతిలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనే ఆయన, ఆపై, తిరుమల చేరుకొని, పద్మావతి గెస్ట్ హౌస్ లో రాత్రికి బస చేయనున్నారు.

మంగళవారం ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకుంటారని, ఆ రోజంతా తిరుమలలోనే గడపనున్న వెంకయ్యనాయుడు, బుధవారం ఉదయం తిరుగు ప్రయాణమవుతారని అధికారులు వెల్లడించారు.

Tirumala
Tirupati
TTD
Piligrims
Venkaiah Naidu
  • Loading...

More Telugu News